రమేష్ మొబైల్లో బ్యాలెన్స్ అయిపోయింది పక్కవాడి దగ్గర ఫోన్ తీసుకొని ఒక కాల్ చేస్తానన్నాడు. వెంటనే తన ఫ్రెండ్ కు ఫోన్ చేశాడు. ‘అరే… నా మొబైల్ లో బ్యాలెన్స్ అయిపోయింది వెంటనే రీచార్జ్ చెయ్యి’ అంటూ ఫోన్ పెట్టేశాడు. వెంటనే రీచార్జ్ అయిన మెసేజ్ వచ్చింది ఫోన్ ఎవరికి చేశాడో అని ఆదుర్దాగా అడిగితే నా క్లోజ్ ఫ్రెండ్ కి చేశానన్నాడు. అవును మరీ అదే నాన్నకో, అన్నకో ఫోన్ చేస్తే బ్యాలెన్స్ ఎందుకురా, ఎవరితో మాట్లాడు తున్నావ్… ఎంత వేయించినా సరిపోదా. అంటూ నానా గొడవ చేస్తారు అంటూ ఓ హితోపదేశం చేశాడు
మనవాళ్ళను మనం చూస్తుంటాం. అదే మనవాళ్ళు అంటే మన ఇంటి ప్రక్కవాళ్ళు, చుట్టుప్రక్కల వాళ్ళు. ఒకప్పుడు మనవాళు , అంటే అంతా బంధువులు మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు బంధువులు, చుట్టాలు దూరమైపోయారు. దూరమైన దోస్తులు మాత్రం మనవాళ్ళయిపోయారు. సంతోషమైనా, దుఃఖమైనా పంచుకునేది ప్రస్తుతం అంతా దోస్తులే. బంధువులపై కారం, దోస్తులపై మమకారం పెట్రోల్ ధరల్లా పెంచుకుంటున్నారు.
ఒక్కప్పటి మన జీవితంలో నేటి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండేది కాదు. అదేనండీ, మనభాషలో చెప్పాలంటే సెల్ ఫోన్, టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్ లాంటివన్న మాట. అప్పట్లో ప్రజలు కేవలం నేను నా పని, నా కుటుంబం ఇంకా ఎక్కువంటే మా ఊరులోని రాజకీయాలు, ముచ్చట్లు చెప్పుకోవడానికి రచ్చబండలను ఉపయోగించేవారు. అలా వారి రోజువారి జీవితం గడుస్తూ ఉండేది. కానీ వారు బోర్ అయ్యేవారు
ఇప్పటి చిన్నా పెద్దా అది విద్యార్థినీ, విద్యార్థులయినా, మహిళా, పురుషులైనప్పటికి వాళ్ళ జీవితంలో సెల్ ఫోన్, ఇంటర్నెట్ ఒక భాగమైపోయింది. ఫోన్లో డబ్బులయి పోతే సగం ఆస్తిపోయినంత పనైపోతుంది. మాట్లాడితే ఫోన్ వైపు చూసి తెగ బాధపడిపోతుంటారు. ఇంటర్నెట్ కట్ అయితే ఫేస్బుక్లో ఎవరు మెసేజ్ చేశారు. ఎంతమంది లైక్ చేశారో అని తెగ మదన కరెంట్ పోయి టీవీ ఆఫ్ అయితే ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ రాజకీయ నాయకుడు ఏం మాట్లాడో అని వీళ్ళు తెగ దిగులు పడిపోతుంటారు
ఇది మానవ నైజం. ప్రతి ఒక్కరిలో ఇలాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనిషి ఎప్పుడూ నలుగురితో కలిసుండాలనుకుంటాడు. నాటి ప్రజలు రచ్చబండలపై ముచ్చట్లు పెడితే, ఇప్పుడు ఒంటరిగా నెట్, సెల్ ఫోన్ లో చాటింగ్ చేస్తుంటారు. ఇలా పేర్లు మారాయే తప్ప మనస్తత్వాలు మారలేదు కానీ ఇప్పుడు వచ్చిన చిక్కేమిటంటే మనం ఎంతగా వీటిలో మునిగిపోయామంటే, అమ్మ వండే వంట ఏమిటో తెలియదు కానీ ప్రపంచం ఓ మారుమూలలో ఏం జరుగుతుందో మన వాళ్ళకు తెలిసిపోతుంది. నాన్న జీతం ఎంతో తెలియదు. కానీ రాజకీయ నాయకుల జీవిత చరిత్ర మనవాళ్ళకు తెలుసు. అసలు మన పక్కన ఏం జరుగుతుందో తెలియదు. కానీ దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలిసిపోతుంది.
పది మందితో పరిచయం కూడా లేని వాళ్ళెందరికో ఫేస్బుక్ ట్వీటర్, ఆర్కుట్లలో వేలాది మంది పరిచయస్తులుంటున్నారు.
అసలు ఇంటిప్రక్కన ఇళ్ళు తగలబడిపోతుందనుకోండి ఫేస్బుక్ లో పెడితే అది లైక్ చేస్తూ షేర్ చేస్తూ కూర్చుంటారే తప్ప, వెళ్లి దాన్ని ఆర్పుదాం అనుకోవటం లేదు. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి. ఎన్ని సీట్లు గెలిచారో తెలుసుకుంటారే తప్ప మనకు కావాల్సిన సర్టిఫికెట్ ఎలా పొందాలో, ఏ అధికారిని కలవాలో తెలియదు. వారితో ఎలా మాట్లాడాలో తెలియదు. అంటే మొత్తానికి మన గురించి తప్ప అందరి గురించి తెలుసుకుంటున్నాం.
చివరికి పరిస్థితి ఎలా దాపురించిందంటే నిత్యజీవితంలో కనీసం ఒక్కరితో కూడా సరిగ్గా మనసు విప్పి మాట్లాడలేని, కనీసం పది మందితో పరిచయం కూడా లేని వాళ్ళెందరికో ఫేస్బుక్ ట్వీటర్, ఆర్కుట్లో వేలాది మంది పరిచయస్తులుంటున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే భార్య భర్తకు పోస్ట్ చేయాల్సి వస్తుంది. కూర ఏం చేయమంటారని? భర్త చేపల కూర తిని మళ్ళీ ఫేస్బుక్ లో లైక్ చేసి, కామెంట్ చేయాల్సి వస్తుంది.
తస్మాత్ జాగ్రత్త! ఈ వాతావరణంలో మనం చిక్కుకున్న ట్లయితే నిజసంబంధాలు కనుమరుగవుతాయి. అంతా అంతర్జాల ఇంద్రజాలంలో కొట్టుకొని పోతాం.



