(సామాన్యుల శక్తిని తక్కువ అంచనా వేయొద్దు)
చాలా మంది తమ బతుకుదెరువు కోసం అనేక రకాల ఉ ద్యోగాలలో కేవలం ధనసముపార్జన కొరకు స్థిరపడతారు. అదేవిధంగా జర్నలిజంలో కూడా చాలా వరకు డబ్బు సంపాదించడానికి, లేదా ఇతరులను వంచించడానికి పని చేసే వారున్నారు. కానీ పాత్రికేయురాలైన రానా అయ్యూబ్ వ్యక్తిత్వం దీనికి పూర్తిగా భిన్నమైనది. పత్రికారంగంలో ఆమె చేసిన కృషి, నిజాలను నిగ్గు చేస్తూ రాసిన “గుజరాత్ ఫైల్స్” పుస్తకం, పాత్రకేయ వృత్తి కేవలం ధన సముపార్జన లేదా ఇతరులను వంచించడానికి కాదని నిరూపించింది. రానా అయ్యూబ్ రాసిన గుజరాత్ ఫైల్స్ పుస్తక పఠనం తర్వాత సమాజ సేవ, అణగారిన పీడిత ప్రజలకు బాసటగా నిలవడం సామాజిక, సాంస్కృతిక, నైతిక న్యాయం కొరకు కృషి చేయడం తమ స్వదేశాన్ని రక్షించుకోవడం అనేవి ఆమె పుస్తకంలో ప్రస్ఫుటంగా కనిపించాయి. ఇవి నాకు చిన్నతనంలో నా తల్లిదండ్రులు నేర్పిన మహాప్రవక్త మహమ్మద్ (సఅస) జీవిత అంశాలను గుర్తుకు తెచ్చాయి.
అత్మ విశ్వాసం : – రానా అయ్యూబ్ రాసిన గుజరాత్ ఫైల్స్ పుస్తకంలో తనను తాను పరిచయం చేసుకుంటూ ఆమె ఈ విధంగా రాసారు. ” ఉన్నత ఆశయాలున్న నా తండ్రి ద్వారా నాకు ఉన్నత ఆదర్శాలు ప్రాప్తమయ్యాయి. వాటి ఆధారంగా నాలక్ష్యసాధనకు నన్ను నేను కష్టపడే మనస్తత్వమున్న పాత్రికేయురాలిగా మలచుకున్నాను.” ఈ విషయం ద్వారా ఎంతో మంది అభాగ్యుల ప్రాణాలతో ఆడుకున్న నాటి ప్రభుత్వాల దమనకాండను తేటతెల్లం చేసింది.
నిరంతర పోరాటం :– చాలా సమస్యల మీద కమీషన్లు, కమిటీల పేరుతో ప్రభుత్వాలు కాలయాపన చేసి, ప్రజల దృష్టిని ఆసమస్య నుండి మరల్చుతాయి. కానీ రానా అయ్యూబ్ లాంటి పాత్రి కేయురాలు సమస్యను పరిష్కరించేంత వరకు నిరంతర పోరాటమే మార్గమని నమ్మి గుజరాల్లో జరిగిన దమనకాండను తేటతెల్లం చేయడానికి రాసిన పుస్తకం ఆమె పోరాట స్ఫూర్తికి నెలువెత్తు నిదర్శనం. ఇదే విషయాన్ని తన పుస్తకంలో ప్రస్తావిస్తూ ” కమీషన్లూ, కమిటీల ప్రభుత్వ వైఫల్యాలు, నిష్క్రియాపరత్వాల పై ఎంత గొంతెత్తి అరిచినా కొంత మంది మాత్రమే శిక్ష అనుభవించి, మిగతా వారు తమ రాజకీయ ప్రోద్బలంతో ప్రభుత్వాధినేతలవుతారు. అయినా వీరు చేసిన తప్పులు చివరకు న్యాయస్థానాల ద్వారా నకిలీ ఎన్ కౌంటర్లుగా నిరూపించబడతాయి. ఇదే గుజరాత్ అల్లర్ల విషయంలోనూ జరిగింది.
బాధ్యతలు తీసుకోవాలి:
చాలా మంది మనకు ఇచ్చే సలహాలు కొన్ని సార్లు మన జీవితాలనే మార్చివేస్తాయి. రానా అయ్యూబ్ కు తన డాక్టర్ ఇచ్చిన సలహా ఆమె మాటల్లో… నిన్ను నీవు తక్కువగా అంచనా వేసుకుని కుంగుబాటుకు లోనుకాకు. ఇలాంటి ఆలోచనలను తన మదినుంచి తీసి బాధ్యతలను నిర్వర్తించడానికి సాగిపో…. అనే విషయం తన జీవితాన్నే మార్చివేసిందని ఆమె చెప్పింది.
గుజరాత్ లో దళితుల స్థితిగతులు :- దళితులపై, అణగారిన వర్గాల ప్రజలపై జరిగే అత్యాచారాలను మనం రోజూ వింటూనే ఉంటాం. తన పుస్తకంలో గుజరాత్ లో దళితుల దైన్యస్థితిని వివరిస్తూ… “ఉన్నతాధికారులు కూడా తాము దళితులం అన్న కారణాన అణగదొక్కబడ్డారు. ఒక పోలీసు ఉన్నతాధికారి గురించి – వివరిస్తూ అగ్ర కులాలకు చెందిన వారి కాలనీలలో దళితుడైన అతనికి ఇల్లుకొనే అవకాశం లేకపోయింది. అంతే కాకుండా మంగళివాడు కూడా దళితుడు అన్న కారణాన క్షవరం చేయడానికి కూడా నిరాకరించిన దాఖలాలు గుజరాత్ లో కనిపించాయని వాపోయింది.
రాజకీయ నాయకుల ప్రైవసీ – తమనుతాము ప్రజాసేవకులుగా చెప్పుకునే రాజకీయ నాయకులు తమ చుట్టూ తమ అనుచర గణాన్ని పెట్టుకుని వారి మధ్యనే సౌకర్యవంతంగా వుంటూ చీకటి చాటున చేసే ఎన్నో సమాజ వ్యతిరేక పనులను కూడా రానా అయ్యూబ్ తనపుస్తకం ద్వారా తేటతెల్లం చేసింది.
ప్రయత్నాన్ని ఆపకు :- గుజరాత్ తో జరిగిన దమనకాండను. వివరిస్తూ రాసిన గుజరాత్ ఫైల్స్ పుస్తకాన్ని ప్రచురించడానికి రానా అయ్యూబ్ సొంత పత్రికా సంస్థ తెహెల్కా నిరాకరించింది. ఇంతకు ముందు బంగారు లక్ష్మణ్ మీద స్టింగ్ ఆపరేషన్ రిపోర్ట్ ప్రచురించటం ద్వారా సంస్థ కార్యాలయం మూసివేయటాన్ని తహెల్కా సంస్థ రానా అయ్యూబ్ ముందు ప్రస్తావించింది. గుజరాత్ ఫైల్స్ లో మోదీ అమిత్ షా లాంటి వారి గురించి జరిపిన స్టింగ్ ఆపరేషన్ ఉంది. గనుక వారు తమ బలాన్ని ఉపయోగించి ప్రతీకారం తీసుకుంటారనే తెహెల్కా ఈ పుస్తకాన్ని ప్రచురించటానికి నిరాకరించింది. జీవితాన్నే పణంగా పెట్టి జరిపిన స్టింగ్ ఆపరేషన్ను పట్టు వదలకుండా గుజరాత్ ఫైల్స్ పుస్తకం ప్రచురించి “సామాన్యుల శక్తిని తక్కువ అంచనా వేయొద్దని” రానా అయ్యూబ్ చాటి చెప్పింది.



