ప్రపంచంలో ఉన్న జీవరాశుల్లో మానవుడు అత్యుత మమైన జీవరాశి. అతనికి ప్రసాదించిన జ్ఞానం ఆధారంగా ఈ స్థానాన్ని పొందగలిగాడు. విశ్వంలో ఉండే నిర్జీవమైన వస్తువైనా జీవమున్న ప్రాణులైన ప్రతీది సృష్టికర్త ఆదేశాల మేర తమ తమ కర్తవ్యాలను నిర్వర్తించాల్సిందే. ఏదీ దీనికి అతీతమైనది కాదు. నిర్జీవమైన వస్తువులు వాటికి ఆజ్ఞాపించిన పనులు అవి తుచాతప్పకుండా పాటిస్తున్నాయి. వాటికి లభించిన అజ్ఞాలను అనుసరించి యజమాని మెప్పు మన్ననలు పొందటానికి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రాణమున్న జీవరాశులలో మనిషికి ఇవ్వబడిన బహుమతులు జ్ఞానేంద్రియాలు వాటికి ఏ పని నిర్దేశింప బడుతుందో అదే కార్యాన్ని చేస్తున్నాయి. ఉదాహరణకు కంటి ద్వారా చూడడం, చెవి ద్వారా వినడం, ముక్కు ద్వారా శ్వాసించడం, వాసన చూడటం, నాలుక ద్వారా రుచిచూడటం మొదలైనవి. కానీ మానవుడికి ఇచ్చిన స్వేచ్ఛా పరిధిలో అతడు తాను స్వేచ్ఛా జీవినని ప్రపంచంలో ఉండే వస్తుసామాగ్రి, సమస్త ధన సంపదలన్నీ తన ఆధీనంలో ఉన్నాయని భ్రమపడుతుంటాడు. తద్వారా భూమిలో కల్లోలాన్ని రక్తపాతాన్ని వైశమ్యాలను సృష్టిస్తాడు. దాని పర్యవసానమే సమాజంలో శాంతి,
న్యాయం, మానవత్వం ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. మనిషి ఈ సృష్టిలో ప్రతీ వస్తువు తనకోసమే అనే బ్రమలో పడి వాటిని తన ఇష్టానుసారం దుర్వినియోగిస్తూ హానికర పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నాడు. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితిలో అతనికి ప్రసాదించబడిన జ్ఞానాన్ని విలాసవంతమైన వస్తు సామాగ్రిని సంపాదించడానికే ప్రయత్నం చేస్తున్నాడు. తద్వారా అభివృద్ధిని కాంక్షిస్తూ దాని కోసం మేడలను నిర్మిస్తున్నాడు. ఇలా ప్రపంచంలో ఉండే వనరులను తన ఆధీనంలోకి చేసుకోవడానికి తీవ్రమైన కృషి చేస్తూ చివరకు మనిషి అనే భావనను మరచిపోయాడు. దీని పర్యవసానం అతనిలో జవాబుదారి తనం బాధ్యతా భావం లోపించి విచ్చలవిడితనం స్వతంత్ర భావాలు బలంగా నాటుకుపోతున్నాయి.
సర్వ మానవాళికి ఆదర్శవంతంగా ఉండవలసిన మనిషి ఇలాంటి కార్యాల వల్ల తన స్థాయిని కోల్పోయి అథమ స్థితిలో జీవిస్తున్నాడు. ఒకవేళ అతనికి ఇవ్వబడిన బహుమతులైనా లేదా జ్ఞానేంద్రియాలు సరైన మార్గంలో వెచ్చించినట్లయితే ఎన్నో అద్భుతాలను సాధించగలుగుతాడు. సమాజ నిర్మాణంలో తనదైన క్రీయాశీల పాత్ర నిర్వహించగలడు.



